చిన్న కథలు ..

మనిషి తలకు ఉన్న విలువ ఏమిటి? ..చిన్న కథ

ఒకసారి అశోకుడు,తన మంత్రి ఒక వీధిలో నడుస్తున్నారు.

దారిలో ఒక బౌద్ధసన్యాసి ఎదురు రాగా అశొకుడు తన కిరీటం తీసి పక్కన పెట్టి తన తలను ఆ సన్యాసి పాదాలపై ఉంచి నమస్కరించాడు. ఈ దృశ్యం చూసి మంత్రి ఒక చక్రవర్తి ఒక సామాన్య సన్యాసికి అంత గౌరవం ఇవ్వడం అనవసరం అని భావించాడు. ఈ విషయాన్ని అశోకుడు గమనించాడు.

తర్వాత ఆ మంత్రికి పాఠం నేర్పదలచి తన మంత్రి తో ఒక గొర్రెతల, ఒక ఎద్దు తల, ఒక మనిషితల తెమ్మని చెప్పాడు. మంత్రి అలాగే తెచ్చాడు. తర్వాత వాటిని బజారులో అమ్ముకొని రమ్మని మంత్రిని పంపాడు. మేక,ఎద్దు తలలను అమ్మగలిగాడు కానీ మనిషి తలను ఎంత ప్రయత్నించినా అమ్మలేకపోయాడు. అదే విషయం అశోకునికి చెప్పగా మనిషి తలను ఉచితంగా ఐనా ఎవరికైనా ఇచ్చి రమ్మన్నాడు. కాని ఏ ఒక్కరూ మనిషితలను తీసుకోవడానికి కాని, కనీసం చూడడానికి కూడా ఇష్టపడలేదు.

మంత్రి తిరిగి సభకు రాగా అశొకుడు అన్నాడు " ఆ రోజు నా తలను ఆ సన్యాసి పాదాలపై పెట్టగా నువు ఏంటి ఇలా చేశారు రాజు అనుకున్నావు. ఇప్పుడే చూసావు కాదా మనిషి తల యొక్క విలువ. బ్రతికి ఉన్నంత వరకే మనిషి తలకు విలువ.చనిపోయిన తర్వాత ఎద్దు,మేక లాంటి జంతువుల తలలకైనా విలువ ఉంటుంది కాని అసలు మనిషి తలను అసలు చూడడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు,ఇక విలువ సంగతి ఏం చెప్పాలి".

రెండు కవితలు (జీబ్రన్..చిన్న కథ )

చాలా శతాబ్దాల క్రిందటి సంగతి- ఒకరోజున ఏథెన్స్ కి వెళ్లే రోడ్డుమీద ఇద్దరు కవులు కలిశారు. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు:

ఒక కవి రెండవవాడిని అడిగాడు- "ఈ మధ్య కాలంలో ఏమేమి కవితలు రాశావు? నీ రచనా వ్యాసంగం ఎలా సాగుతోంది" అని.

రెండవ కవి చెప్పాడు గర్వంగా- "ఇప్పుడే నేను అత్యద్భుతమైన కవితను ఒకదాన్ని రాయటం పూర్తి చేశాను- బహుశ: మన గ్రీకుభాషలో రాయబడ్డ అతి గొప్ప కవిత ఇదే అయి ఉంటుంది. మహా శక్తిసమన్వితుడైన జియుస్ కి ఆహ్వానం పల్కుతుందది.

"అలా అని, అతను తన అంగరఖా జేబులోంచి ఒక కాయితాన్ని తీసి, "ఇదిగో, చూడు. నా జేబులోనే ఉన్నదది. నేను నీకు దాన్ని చదివి వినిపిస్తాను. రా, మనం ఇక్కడే, ఆ చెట్టు కింద నీడలో కూర్చుందాం" అన్నాడు.
ఆ పైన అతడు దాన్ని చదివి వినిపించాడు. చాలా పెద్ద కవిత అది.

మొదటివాడు దాన్ని శ్రధ్ధగా విని, అన్నాడు సౌహార్ద్రతతో- "ఇది నిజంగానే అద్భుతమైన కవిత! అనేక తరాల పాటు ఇది నిలచి ఉంటుంది. ఈ కవిత ద్వారా నీ ప్రజ్ఞ జగద్వితమౌతుంది" అని.
రెండవవాడు అప్పుడు ప్రసన్నంగా అడిగాడు మొదటికవిని- "ఈ మధ్య కాలంలో నువ్వేమిరాశావు?" అని

."నేను పెద్దగా ఏమీ రాయలేదు. తోటలో ఆడుకునే ఓ పిల్లవాడిని గుర్తుచేసుకుంటూ ఊరికే ఒక ఎనిమిది లైనులు రాశానంతే." అని మొదటికవి వాటిని పాడి వినిపించాడు.
దాన్ని విని రెండవవాడు మెచ్చుకున్నాడు- "పర్లేదు, బాగానే ఉన్నది" అని.
ఆపైన వాళ్లిద్దరూ ఎవరిదారిన వాళ్లు వెళ్లారు.


ఇప్పుడు, రెండువేల సంవత్సరాల తర్వాత, మొదటి కవి రాసిన ఎనిమిది లైైన్లనీ ప్రతి నోరూ పాడుతున్నది. అందరూ వాటిని ప్రేమగా గుర్తు చేసుకుంటున్నారు.
రెండో కవిత కూడా నిలచింది- లైబ్రరీలలోను, పండితుల అలమారల్లోను అది శతాబ్దాల పాటు నిలచింది. దాన్నీ కొందరు గుర్తుంచుకున్నారు- అయితే ఎవ్వరూ దాన్ని ప్రేమించలేదు. ఎవ్వరూ దాన్ని పలకలేదు


Comments

Post New Comment


lakshmi 03rd Dec 2012 22:20:PM

enti adi? modatidi edi rendavadi edi?


ఉష నాయుడు 19th Nov 2012 01:08:AM

చాల బాగుంది.