శిధిలనగరం లో సజీవశిల్పం ..

హంపికి దగ్గరలో నాగలాపురంలో పురాతన కట్టడాలు బయట పడ్డాయట, అప్పట్లో అది ఒక విధంగా సంపన్నమైన ఊరే అనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి, అక్కడ ఒక పెద్ద గుడి కూడా ఉంది కానీ అందులో విగ్రహాలు లేవు, దానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.అసలు విగ్రహాలే ప్రతిష్ఠించలేదనే వాదన కూడా ఉంది, వింత ఏమిటంటే అక్కడ దొరికిన కొన్ని పత్రాలు  వేరు వేరు చోట దొరికినా అందులో ఉన్న విషయం మరియు చేవ్రాలు ఒకటిగా ఉండడం, ఇప్పటివరకు ఎక్కడ కనిపించని వింత విషయం, అది కూడా ఒక స్త్రీ అంగుళీయక ముద్రితం కౌముది అని కావడం..

ఎప్పుటి సంగతో  800 సంవత్సరాలకి పూర్వం అంటే ఇంచుమించుగా విజయనగర ప్రభువుల పరిపాలనా కాలం, ఆ కాలంలో నాట్య సంగీతాలకి పెద్ద పీట, రాజనర్తకీమణులకు తగిన గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, గౌరవప్రదమైన జీవితం గడిపే వారికీ కొదవేలేదు.. అటువంటి రాజ్యపాలనలోనే వేశ్యా వృతి కూడా కొన్ని కట్టుబాట్లతో కొన్ని సాంప్రదాయాలతో వర్దిల్లుతూనే ఉండేది. వేశ్యకుటుంబంలోని ఏ కాంత ఐనా  రాజవంశీయుల వల్ల సంతానా ప్రాప్తి పొందితే, వారి పిల్లలు యవ్వనం లోకి అడుగుపెట్టే సమయానికి ఆ రాజ్యం వీడి వెళ్ళాలి అన్నది అప్పటి కట్టుబాటు.

అప్పటి కట్టుబాటు వల్ల ఏ రాజ్యం నుంచో ఇక్కడ విజయనగర సామ్రాజ్యంకి వచ్చింది కుముదిని. ఆమె అందచందాలు చూసి ఎందరో తమ అంతరంగ మందిర దేవేరిగా ఉండమని కోరినా, వారి కోరికను తోసిపుచ్చి విజయ నగరరాజుల ఆదరణతో, ప్రతిరోజు ఉదయం ఇంటి బాధ్యత  మోసే మగవాడు కుముదిని  దైవ దీపారాధనకి నూనె అందించాలనే రాజుగారి చాటింపుతో...   తన నివాసానికి  100 గడపలున్న ఒక పల్లెలో ఎంచుకుంది కుముదిని.

ప్రతిరోజు ఉదయమే పల్లకిలో మేలిముసుగుతో స్వామి ఆలయం చేరి దీపారాధన చేసి తిరిగుముఖం పట్టినాక గాని ఊరికి తెల్లవారేది కాదు. ఆమె అందం గురించి, ఆమె గురించి చిలువలు పలువలుగా ఎన్నో కథనాలు వినిపించడమే కానీ ఆమె ఎలా ఉంటుందో ఆ ఊరి కుటుంబీకులకు ఎవరికీ తెలియదు, నూనె ఇవ్వడానికి వెళ్ళే ఆ ఇంటి మగవాడు చెప్పే మాటలే ఆ ఊరి స్త్ర్రీలు తమ కథనాలకు ఆలంబనగా చేసుకునేవారు..

కుముదిని అక్కడ నివాసం ఏర్పపరచుకొని అప్పుడే 3 ఏళ్లు గడిచాయి, ఆమెలో కానీ ఆమె నివాస గృహంలో కానీ పెద్ద మార్పులేమీ చోటు చేసుకోలేదు, ఆమె వచ్చిన రోజు ఆమె గురించి ఏమనుకునేవారో ఇప్పుడు అంతే తెలుసు ఆ ఊరి వారికి..కాని ఒకరోజు ఆ ఊరి పేరు రాయలవారి ప్రాంగణం చేరి, రాజుగారిలో కలవరపాటు రేకెత్తించింది. ఆ చిన్న పల్లె రాచనగారానికి దీటుగా అభివృద్ధి వైపు సాగిపోవడం అందరిలోనూ ఆశక్తి రేకెత్తించింది, ఎన్నో పథకాలు ఆ పల్లెకోసం రాజుగారు వేసినా సాధించలేని అభివృద్ధి, రాయలవారి కోశాగారం నుండి ఎంటువంటి సహాయం అందుకోకుండా సాధించడం రాయలువారిని కూడా అబ్బురపరిచింది.

అలా ఒక పుష్కరం ముగిసింది, ఒకరోజు ఉదయం గుడికి కుముదిని రాలేదు, గుడి తలుపులు తెరిచినా పూజారి నివ్వెరపోయాడు అందులో వెలిగే దీపం ఉంది కాని దేవుడే కనిపించలేదు, ఆయనే కాదు ఆ పక్కన ఉన్న అమ్మవారు  ,(విగ్రహం ) కూడా.....ఈ విషయం తెలుసుకున్న రాయల వారు కుముదిని అదృశ్యం, విగ్రహాల ఆచూకి పల్లె అభివృద్ధి వెనుక ఉన్న కారణం...అన్నీ సహేతుకంగా కనుక్కొని రమ్మని తన అంతరంగ గూఢచారులని పంపాడు ...

రాయలవారికి గూఢచారులుచెప్పిన కథ.....


కుముదిని ఆ పల్లెకు వచ్చినపుడు రాయలవారి చాటింపు ప్రకారం రోజు ఇంటి బాధ్యతమోసే పురుషుడు గుడికి నూనె తీసుకొని వచ్చేవాడు..వచ్చిన వారితో దీపారాధనంతరం అతని కుటుంబ స్థితిగతులు,అతని ఇష్టాయిష్టాలు అన్నీ తెలుసుకొని తన నివాసం చేరేది, అప్పటికి కానీ ఊరికి తెల్లవారేది కాదు..ఇలా అందరిగురించి తెలుసుకునేందుకు ఆరు మాసాలు పట్టింది, ఆ తరవాత నుండి దీపారాధనకు నూనె గైకొని సాయంత్రం తన మందిరానికి విచ్చేయమని ఆహ్వానించి....వచ్చిన అతనికి స్వర్గ సుఖాలని అందింఛి,అతని ఇష్టాయిష్టాలనెరిగి మనసా వాచా అతనికి తగిన భార్యాగా మెసిలి, ప్రేమతో ప్రియురాలి గడసరితనంతో ఒక ఆంక్ష విధించేది అతనికి ......

నాకు ఎంత మూల్యం చెల్లిస్తే అంతటి సుఖాన్ని నీకు అందిస్తాను కానీ నాకు ఎంతటి మూల్యం చెల్లిస్తావో అంతే మొత్తం ముందుగా ఊరికోసం,తరవాత నీ ఇల్లాలికి, చివరగా నాకోసం తీసుకురావాలి అని ....ఆమె లోని ప్రేమకు అందానికి మన్ననకి కట్టుబడిన పురుషుడు ఆమె కోసం కష్ట పడడం మొదలెట్టాడు ఆరునెలలు ఒకసారి మాత్రమే  ఆమెతో గడపడం సాధ్యం అయినా.. ఆమెతో ఆ ఒక్కరోజు గడపడం కోసం ఆరునెలలు అవిశ్రాంతంగా శ్రమించేవారు. , అదే ఊరి అభివృద్దికి ఊరి ఉన్నతికి మొదటి మెట్టు అయ్యింది.......పుష్కరం అయ్యేసరికి ఆ ఊరు అలవి కాని సిరిసంపదలతో నిండిపోయింది...కానీ రాను రాను .ఆ ఊరి స్త్రీలకు కుముదిని కంటిలోని నలుసులా కనిపించ సాగింది.

ఒకరోజు దీపారాధనకు పురుషుడి వేషంలో ఒక స్త్రీ నూనె తీసుకొని వచ్చింది, అది తెలియని కుముదిని తన మేలి ముసుగు తొలగించి అతని చేతిలోని నూనకై చేయి చాపింది...ఆమె అందాన్ని చూసి నివ్వెరపోయిన ఆ స్త్రీ ....నీ కోసం నా భర్త దారి తెన్నూ లేకుండా కష్టపడుతున్నాడు, నా భర్తను వదిలిపెట్టు అని వేడుకుంది....మాట ఇచ్చిన కుముదిని మేలి ముసుగు అక్కడే వదిలి తన మందిరం చేరింది....
ఇది నీ భర్త నా చెంత వీడిన సొమ్ము...నేను జన్మతః వేశ్యనే కానీ..వృతిరీత్యా పొందికైన ప్రియురాలినే,అందములోనూ, గుణములోను మిన్ననే..... మీ అభివృద్ధి కి నేను దాతనే కాని దొంగని కాను...వేశ్య పుట్టుకకి వన్నె తెచ్చిన రాచకన్యలాంటి కుముదిని  కానుక....కుముదిని అంగుళీయకముద్రిత లేఖతో కూడిన బహుమానం ఒకటి ప్రతీ ఇంటి స్త్రీకి అందచేయబడిందని. ఆ తరువాత ఆమె గురించి ఎటువంటి ఆనవాలు తెలియ రాలేదు.

మరుసటి రోజు యధావిధిగా ఆమె కోసం ఆలయంలో వేచి ఉన్న పురుషునికి కుముదిని కనిపించనేలేదు....ఆమెతో  పాటు...అక్కడి గుడిలోని విగ్రహలుకూడా మాయం అయ్యాయి, అవి అతి సులువుగా ఎత్తుకేల్లె చిన్న విగ్రహాలు కూడా కాదు ...కుముదినికి అంగ రక్షకుడుగా ఆ దేవుడే కదిలి వెళ్ళాడని ఆ ఊరి ప్రజల నమ్మకం ....నిజానికి విగ్రహాలు ఏమయ్యాయి అన్నదానికి వీసమెత్తు ఆచూకి కూడా లభించలేదని రాయలవారికి విన్నవించారు గూఢచారులు సవినయంగా .......

ఇప్పటికి అక్కడ విగ్రహాలు లేని ఆలయం మీకు కనిపిస్తుంది.... 
ఎన్నో చరిత్ర కట్టడాలు, శిధిలాలు కనిపిస్తాయి...హంపి చుట్టుప్రక్కల....
అందులో ఈ నాగులాపురం ఒకటి. ఇక్కడ ఉన్న చరిత్ర నిజం...
ఆ చరిత్ర చదివాక మదిలో మెదిలిన ఒక ఊహకు రూపకల్పన మాత్రమే ఈ కథ.....

1 నాగలాపురం.. అనంత శయన ఆలయం (చరిత్ర..ఇది మాత్రమే నిజం..)


"శ్రీ కృష్ణ దేవరాయలు తన భార్య పేరున గుర్తు గా ఒక పట్టణాన్ని కట్టించెను. అందు అందమైన భవనాలు, అందమైన ఒక పెద్ద దేవాలయాన్ని కూడ నిర్మించెను. ప్రతి యేడు దశరా తర్వాత రాజు గారు ఇక్కడ నివసించును. ఆ నగారం పేరు నాగలా పురం " అని అన్నాడు డొమింగో పీస్. ఆలయం ముందున్న సూచిక లో " ఈ ఆలయాన్ని శ్రీ కృష్ణ దేవరాయలు తన తనయుని పేరున తిరుమల రాయ పురమనే నగరంలో అనంత శయన స్వామికి క్రీ.శ. 1526 లో ఈ ఆలయాన్ని కట్టించెను" అని వున్నది. అదే ఆ నాటి నాగలాపురం.అదే నేటి హోస్పేట. కానీ ఇక్కడ ఎటువంటి చారిత్రిక కట్టడాలు కనుపించవు. సమీపంలో తుంగభద్ర డాం వున్నది.. హోస్పేట శివార్లలో అనంత శయన ఆలయం వున్నది. ఇదే ఆనాటి దేవాలయం. ఇది చాల పెద్దది. ఉత్తరాభిముఖంగా ముందున్న ముఖ ద్వారము గాక కుడి ఎడమలకు కూడ చిన్న ద్వారా లున్నాయి. గర్బాలయం చా ల విశాలంగా వున్నది. అనంత శయన విగ్రహం పడుకొని వున్నట్లుంటుంది గాన గర్బ గుడి విశాలంగా వుంది. లోపల విగ్రహం లేదు. స్థానికుల కథనం ప్రకారం ఇందులో విగ్రహం స్థాపించనే లేదట. దానికొక కథ చెప్తారు. గర్బగుడి ముందున్న విశాలమైన హాలులో ఏడం పక్క గోడకు తెలుగులోను సంస్క్రుతంలోను శిలా శాసనం చెక్కి వుంది గమనించ వచ్చు. పక్కననే అమ్మ వారికి కూడ ఆలయం వున్నది. ఎందులోను విగ్రహాలు లేవు. ఆవరణంలో ఒక కోనేరు కూడ కలదు.


Comments

Post New Comment


balaji reddy s 22nd Jun 2013 04:53:AM

great story