కాఫీ విత్….గీతా వెల్లంకి, ‌ 'ఆర్.రమా దేవి'..399

*కాఫీ విత్….గీతా వెల్లంకి,
‌ 'ఆర్.రమా దేవి'..399

*దిగంతాల ప్రేమ వారి సొంతం..!!
*కలడో! లేడో? కలనైనా రాడో..?
అన్న సంశయం వారి సొంతం..!!

ఒకరు ప్రేమకవితల పాలకంకి 'గీతావెల్లంకి'
మరొకరు…ఇప్పుడిప్పుడే  ప్రేమ కవితలకు
కొత్తందాల్ని అద్దుతున్న ఆర్.రమాదేవి..!!

వీళ్ళిద్దరిలో గీతా వెల్లంకి సీనియర్.. 'రమాదేవి ' జూనియర్ ..కవిత్వంలో పోలికలు సరేగానీ,  నిజ జీవితంలో కూడా వీరిరువురూ.. స్నేహితులు.
భావ సారూప్యతే కాదు.స్నేహ సారూప్యత కూడా వీళ్ళ కవిత్వంలో   కనిపిస్తుంది...!!

దిగంతాల ప్రేమను తమలో ఇమడ్చుకోవడం,
కవిత్వంలో ప్రేమ 'రస' భావనను మిస్ కాకుండా చూసుకోవడం వల్ల ఇరువురి కవిత్వంలో 'ప్రేముడి ' కనిపిస్తుంది... ప్రేమ 'తడి' తగులు
తుంది. స్వప్నంలాసాక్షాత్కరిస్తుంది. ప్రేమ... ఓ‌ మధురానుభూతిలా  నిలుస్తుంది.భావనాత్మకమే అయినా ..ప్రేమ 'శేషం' ఆత్మాశ్రయంలా భ్రమింప జేయడం ఈ ఇరువురు కవయిత్రుల 'కవనం' లోని విశేషం.!!

*గీతా వెల్లంకి ..!!
ప్రేమ కవిత్వానికి చెరగని గీత ఈమె  కవిత్వం. ఒకటా!  రెండా? రెండు, మూడు సంపుటాలకుసరిపడా ప్రేమ  కవితలు రాశారామె." డార్క్ ఫాంటసీ " పేరుతో తొలి  కవితా సంపుటి...వెలువడి...ఏడాది దాటిపోయింది‌‌. గీతగారి కవిత్వంలో ' సఖుడు '  నాయకుడు ఆమె నాయిక.పరిస్థితులవల్ల ఇద్దరి మధ్య ఎడబాటు..విధి ఆడుతున్న  వింతనాటకంలో ఇప్పటికీ వీరు పాత్రధారులే. ఏమైతేనేం?  ఎడబాటు కలిగింది..కానీ,భౌతికంగా ఎడంగా వున్నా..గుండెలో గూడుకట్టుకునే వున్నాడు. తిరిగివస్తాడన్న ఒకే ఒక్క ఆశ ఆమె కవిత్వానికి ఊపిరిపోస్తోంది. 'కలవో? లేవో? కలనైనా రావో “అంటూ ఆమె ఎదురు చూస్తోంది. ఈ నిరీక్షిణే ఆమె కవిత్వానికి ఆక్సిజన్…!!

“అప్పుడప్పుడూ ఎవరో వెనక నుంచున్నట్లుంటుంది
ఒక గాలి స్పర్శలాగా తడిమి పోయినట్లుంటుంది
చెవిలో ఏదో చెప్పినట్లవుతుంది
చూస్తే ఎవరూ ఉండరు “
ఇదీ నాయిక మానసిక పరిస్థితి.తనువున్నాలేనట్లే.కానీ, వున్నాడన్న భ్రమ. లేడనుకున్నవాడు వున్నాడా? వుంటే మరి  రాడే?

ఏమో?
అతడి ఊసులకు దూరంగా  వుందామనుకున్నా, వుండలేని  పరిస్థితి.అతనెక్కడున్నా,తన హృదయానికి అద్దినట్లుంటాడు.పక్కనే వుంటాడు.పట్టుకుందామని చేయి జాపితే జారిపోతాడు.కలలా కరిగిపోతాడు.
పాపం! అతని ఊహల్లోనే ఆమె అలిసిపోతోంది.మనసంతా బేజారు..నిద్రలేదురేయంతా జాగారమే.అతని ఊహల్లోనే
జీవనం....అతని కోసమే ఈ  ఎడతెగని నిరీక్షణ.ఒక్క సారైనా వచ్చిపోరాదా? అని ఎంత బతిమాలినా ఓ పట్టాన ఆలకించడు.తను శూన్యంగానే‌ ఉందామనుకుంటుంది.కానీ,మనసంతా అతనే నిండి వుంటే ఎలా
సాధ్యం.? .అందుకే అతగాడినే తలుస్తూ…తలపోస్తూ..!

"‌నువ్వెక్కడో ఉంటూనే ఇక్కడ ఉన్నట్లుంటావు...
నా హృదయానికి సరిపడేలా
అద్దినట్లుంటావు
నువ్వు పక్కనే ఉన్నావనుకుని
చేయి జాపుతాను.. తగలవు
దూరంగా ఉన్నావనుకుని
కళ్ళు విప్పచూస్తే...
ఎక్కడా కనపడవు

రేయంతా నిద్రలేకుండానే గడుస్తుంది
పగలంతా బిక్కు బిక్కుమంటుంటుంది
నీ ఊహల్లో అలిసిపోతున్నాకాస్త రావచ్చుగా మళ్ళీ ఒకసారి!"
*(కలవో? లేవో...కలనైనా రావో ?)
ఇలా…ఆమె ఇప్పుడు ..ఎప్పుడూ ఊహల్లోనే బతుకుతోంది.ఒకప్పటి ఆకాశాన్ని తెచ్చి కప్పుకుంటోంది.ఆకాశం  కింది  మునుపటి
పాత జ్ఞాపకాల్లో మునిగితేలుతూ వుంటుంది. ఆకాశం ఆమె మానసం.!

గీతగారి కవిత్వమంతా భ్రాంతే. ‘కలడో..!
లేడౌ ?  అన్న భావన చుట్టే ఆమెకవిత్వం గిర్రున తిరుగుతుంటుంది. అదే  భ్రాంతిలో కనీసం ఒక్కసారి కలలో అయినావచ్చిపోతే బావుండు అనే స్థితి ఆమెది. ఇదో మానసిక దశ లేనివారు వున్నట్లు వూహించుకుంటూ.. ఆ ఊహల్లోనే..ఆ ఊసుల్లోనే బతికే మనో విభ్రాంతి.!!

*ఆర్.రమాదేవి..!!
రమాదేవి కవిత్వంలో కూడా సేమ్ ప్రేమ ఫీల్ వుంటుంది. అయితే తనదైన డిక్షన్ తో దానికో కొత్తఅందాన్ని పులుముతుంది రమాదేవి.
ఇతర కవితల్లో మాదిరిగానే,ఇందులోకూడాప్రియసఖుడికోసం ఎదురు చూసే ప్రియురాలు కనిపిస్తుంది.చూడ్డానికి ఆత్మాశ్రయంలా అని
పిస్తుంది.అదే ఈమె  ప్రేమ కవితల్లో‌  వున్న.. మత్తు‌…గమ్మత్తు..!

"ఎవరెవరో ఎదురుపడతారు
మరెవరో పలకరిస్తారు
నువ్వు రావని తెలుసు
ఇక్కడ లేవని తెలుసు
కంటికి ఆనవు .. మదిని తాకవు
అయినా  తెలిసి తెలిసి
అందరిలో నిన్ను వెతుకుతా
అలసిపోతానేమో .అణగారిపోతానేమో
ఆక్రందనలు చేస్తానేమో ...
అయితేనెం....
ఓడిపోయానని ఒప్పుకోలేను
నిన్ను వదిలి నేను తప్పుకోలేను
నీవున్న తావుకు నిదురనై వస్తా
ఆకాశపు రెక్కల పక్షినై
నీ కలలో విహరిస్తా....
ముడుచుకున్న నత్తగుల్లవోలె 
నీలోలోపల దాగిపోతా...
నిజంగా నిజం చెబుతున్నా
తడియారిన నా కన్నుల సాక్షిగా."!!

మనసు పిచ్చిది. మాటవినదు‌.ఎంత సంబాళించు కుందామనుకున్నా..కుదరడంలేదు… తాను ఓడిపోయానని ఒప్పుకోలేదు..అలాగని అతడ్ని వదిలి  తప్పుకోనూ లేదు..
ముడుచుకున్న నత్తగుల్లలా..అతడి లోలోపల దాగిపోవాలని పిస్తుంటుంది..
జీవితం ఎంత చిత్రమైంది..జీవనయానంలో ఎవరెవరో ఎదురుపడతారు ..మరెవరో పలకరిస్తారు..కానీ అతడి జాడమాత్రం తెలీదు…
అతడు  రాడని  తెలుసు.. ఇక్కడ లేడనీ… తెలుసు..అసలు కంటికి ఆనడు..మదిని తాకడు..అయినా  తెలిసి తెలిసి అందరిలో అతడినే వెతుకుతూ వుంటుంది..ఈ వెదుకులాటలోఅలసిపోతుందో ...అణగారిపోతుందో ..లేక ఆక్రందనలే చేస్తుందో తనకే  తెలీడం లేదు.‌
ఏమీ తెలియని ఓ అస్పష్టత.తనకే తెలీని ఓ మాయపొర తన చుట్టూ కప్పేసివుంది..

అయితేనేం..?
ఓడిపోయానని మాత్రం ఒప్పుకోలేదు.అతడ్నివదిలి తను  తప్పుకోనూ లేదు..తీరాన్ని చేరలేక..సముద్రాన్ని వీడలేక సతమతమయ్యే
'అల' పరిస్థితి ఆమెది.‌ఇప్పుడు ఆమె మానసం కల్లోల జలధి. గమ్యంతెలీని సారధి.అంతమేలేని వారధి.

అతడున్న చోటికి  నిదురగానైనా వెళ్ళాలని..
ఆకాశపు రెక్కల పక్షై అతడి కలలో విహరిం
చాలనుకుంటోంది…

అంతేనా?
ముడుచుకున్న నత్తగుల్లలా అతడి లోలోపలే దాగిపోమనుకుంటోంది.. ఇదేదో సొల్లు కబుర్లు అనుకుంటాడేమో అతగాడు‌.. నిజంగా నిజమే  చెబుతున్నా సఖా ! అంటూ తడారిన కన్నుల సాక్షిగా చెబుతోంది…

అయినా…
తన గోడు అతడు వింటాడా?
తనకోసం తిరిగి వస్తాడా..?
తమ ప్రేమకు శుభం కార్డు పడుతుందా?
ఏమో…?

గీతగారి కవిత్వం మాదిరే రమాదేవి కవిత్వం కూడా  భ్రాంతే. ‘కలడో..! లేడో ? అసలు వస్తాడో! రాడో..? అన్న భావన చుట్టే రమాదేవి కవిత్వం కూడా  చక్కర్లుకొడుతుంటుంది. అదే  భ్రాంతిలో కనీసం ఒక్కసారి కలలో అయినా కనిపిస్తే.‌చాలు అనే స్థితి ఆమెది.

గీతమ్మ మానసిక స్థితిలాంటిదే రమాదేవిదికూడా…లేనిది  వున్నట్లు వూహించుకుంటూ.. ఆ ఊహల్లోనే..ఆ ఊసుల్లోనే బతికే మనో విభ్రాంతే రమాదేవిది కూడా…

మనుషులు వేరైనా….
దేహాలు రెండైనా…..
గుండె మాత్రం ఒక్కటే…
స్పందన కూడా సేమ్ టు సేమ్..
అదే ప్రేమ..అదే భావన..అదే నిరీక్షణ
అవే ఎదురు చూపులు…!!

*ఎ.రజాహుస్సేన్.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!