"కాఫీ విత్ ..ఆర్.రమాదేవి.311 - రజాహుస్సేన్

"కాఫీ విత్ ..ఆర్.రమాదేవి.311

*ఓ ప్రేమ పూర్వక తీయని అనుభూతితో
అతడితో 'మాట్లాడాలని వుంది '.!!

*ఆమె పై అతడు ఏ 'రంగు' చల్లి వెళ్ళాడో?
*అతడ్ని కలుపుకొని ఆమె అనంత మైందా?
*తన్ను తాను ప్రేమిస్తుందో?
లేక తనలోని అతడ్ని పెనవేస్తోందో "?
అన్న తడబాటు ఆమెది..!!

రమాదేవి గారు ప్రేమకవిత్వం బాగా రాస్తారు.
రమాదేవి కవిత్వంలో ఓ ఫీల్ వుంటుంది..అది
❤️ గుండెను తడుతుంది.మనసు పారవశ్యంలో
మునిగితేలుతుంది..

అలాంటి కవితల్లో ఇప్పుడు
కాఫీ టైమ్ లో ప్రస్తావిస్తున్న ఈ కవిత ఒకటి…!!

మాట్లాడాలని వుంది..‌..
ఔను…
అతడితో  మాట్లాడాలని వుంది..!
*ఇద్దరు కలిసినపుడు మాటలే లేవే?
మరలాగైతే…
ఎలా మాట్లాడాలి ? ఏం మాట్లాడాలి ?
అన్నది ఆమె  సమస్య..?
అతనితో..ఆమె ఇలా అంటోంది.!

"నీతో మాట్లాడాలని ఉంది.పదం పదం కలుపు
తూ వాక్యాలన్నీ పోగుచేసి ఆగకుండా నిరంత
రంగా మాట్లాడాలని ఉంది.అయినా నాలోని మాటలు  నీవైనప్పుడు .
నీలోని  కొంత నా దగ్గర ఉందనుకున్నప్పుడు 
ఏమని మాట్లాడను.?

అయినా…
మన మధ్య మాటలంటూ ఉన్నాయా?
అసలు నేనంటూ మిగిలానా?
క్షణం క్షణం కాలంఒడిలో
"నువ్వు" నాకు అనంతమై..
"నేను'  ఆనవాలు ఆచూకీ లేకుండా. పోయాను.."

ఈ కవితా పాదాలు చదవగానే ఆత్మాశ్రయం అనిపిస్తుంది.
కవయిత్రి తన స్వానుభవాలను ప్రేమలో రంగరించి రాశారనిపిస్తుంది.ప్రేమ కవిత్వంతో వచ్చే
చిక్కే ఇది.ముఖ్యంగా కవయిత్రులు ఇలారాసినప్పుడు ఈ కవితా పాదాలను కవయిత్రి పర్సనల్ లైఫ్ కు అంటగట్టేస్తారు.ఇంకో మాటలో చెప్పాలంటే…
తాటాకులు కట్టేస్తారు..నిజానికి కవిత్వం ఆత్మశ్రమే అయినా..అది ఊహాత్మకమైందన్న విషయాన్ని …
గంర్తుంచుకోవాలి‌..ఇక్కడ కూడా కవయిత్రి ఊహాత్మక భావనే..!

ఇద్దరూ కలిసినపుడు,వారి మధ్య మాటలకు సమయం ఎక్కడుంటుంది?
అసలు ఇద్దరొక్కటైనప్పుడు ఇక వేర్వేరుగా మిగిలే అవకాశం ఎక్కడ?
ప్రతీ క్షణం కాలంఒడిలో అతడు అనంతమైతే,ఇక  ఆమె ఆన
వాలు ఆచూకీ ఎక్కడుంటుంది?

అతడు ఓ  రంగు రంగుల సప్తవర్ణం..ఆ రంగుల్లో ఆనవాళ్లు ఎరుక పరచని తెలుపై  అతడిలో ఆమె
చిక్కుబడిపోతుంది..చిక్కబడి పోతుంది.ఆమెకొండ గాలి వాటంగా ఉన్నప్పుడు.అతడు ఏ రంగుఆమెపై
చల్లి వెళ్లాడో?ఏ ఆనవాలు ఆమెలో దాచి వెళ్లాడో తెలియని తికమక ..

ఒకసారి అతడి  నిదుర అతనిదే అనిపించింది.
మరోసారి అతడి నిదుర సగం ఆమెదైంది.
ఎంతైనా ఆమె..అతడిలో సగం కదా.! ఒక్కొక్కప్పుడు
అతడి  మౌనంలో ఆమె చిరునవ్వు ఒదిగిపోయింది.
అప్పుడు 'నేనంటూ ఉన్నానా' ? అన్నఅనుమానం ఆమెలో కలిగింది‌.
ఇక్కడే ఆమెకోసంశయం కూడా కలిగింది… ‌
అతడ్ని కలుపుకొని ఆమె అనంత మైందా?
లేక తనే అలా అయిందా? ఈ విషయమై…
ఇతిమిత్తంగా తేల్చుకోవాలని ఆమెకు లేదు.
అసలు ఏం చెప్పాలో ఆమె కు అర్థం కాని పరిస్థితి.

"ఏమని చెప్పేది..
నన్ను నేను ప్రేమిస్తున్నానో...
నాలోని నిన్ను పెనవేస్తున్నానో…"
అన్న తడబాటు ఆమెది..
అతడి అడుగుల ఆనవాలు వెతకాలని ఉందామెకు ...
ఈ వెతుకులాటలో తాను తప్పిపోవాలని..  వుందామెకు..
అతడితో మాట్లాడాలని, …మాటలకందని మౌనంలో ఒదిగి పోవాలని….
అసలు తనకు తానే..ఎరుకలేకుండా పోతోందామె….
బహుశా అతడికామె  అర్థం అయ్యిందని
కాబోలు…!!....

*ఇప్పుడు రమాదేవి గారి కవిత
పూర్తి పాఠం చదవండి…!!

*మాట్లాడాలని.❤️

నీతో మాట్లాడాలని ఉంది పదం పదం కలుపుతూ వాక్యాలన్నీ పోగుచేసి ఆగకుండా మాట్లాడాలని ఉంది నీతో.. అయినా నాలోని మాటలు నీవైనప్పుడు.. నీలోని కొంత నా దగ్గర ఉందనుకున్నప్పుడు.. ఏమని మాట్లాడను.. మాటలంటూ ఉన్నాయా... నేనంటూ మిగిలానా
క్షణం క్షణం కాలంఒడిలో "నువ్వు ' నాకు అనంతమై.. "నేను'  అనే ఆనవాలు ఆచూకీ లేకుండా పోయింది....
నీవు ఒక రంగు రంగుల సప్తవర్ణం అని పదే పదే చెబుతాను కానీ అన్ని రంగుల్లో ఆనవాళ్లు ఎరుక పరచని తెలుపునై నీలో చిక్కుబడిపోయాను..
నేనెక్కడు కొండ గాలి వాటంగా ఉన్నప్పుడు.. నీలోని ఏ రంగు నాపై చల్లి వెళ్లావు... ఏ ఆనవాలు నాలో దాచి వెళ్లావు...
ఒకసారి నా నీడ నీదిగా ఉంది... మరోసారి నీ నిదుర సగం నాది అయింది... ఒక్కొక్కప్పుడు నీ మౌనంలో నా చిరునవ్వు ఒదిగిపోయింది..  నేనంటూ ఉన్నానా... నిన్ను కలుపుకొని అనంతానయ్యానా.. ఇతిమిత్తంగా తేల్చుకో
వాలని లేదు...
ఏమని చెప్పేది.. నన్ను నేను ప్రేమిస్తున్నానో... నాలోని నిన్ను పెనవేస్తున్నానో...
నీ అడుగుల ఆనవాలు వెతకాలని ఉంది …
ఈ వెతుకులాటలో నేను తప్పిపోవాలని ఉంది.
నీతో మాట్లాడాలని ఉంది..  మాటలు అందని మౌనంలో ఒదిగి పోవాలని ఉంది..
నాకు నేను ఎరుకలేకుండా పోతున్నాను..
బహుశా నీకు
నేను అర్థం అయ్యానని కాబోలు....

ఈ కవిత మొత్తం ఆమె మాటలకందని మధుర
భావన.మనసులతో ముడిపడి,మనుషులతో
నిమిత్తం లేని… మధుర భావన, ప్రేమ వీచిక..!

ఇలా రాయడానికి భాషతో పాటు హృదయమూ వుండాలి..
ఆ రెండూ రమాదేవి గారిలో పుష్కలంగా కనిపిస్తున్నాయి…!!

*ఎ.రజాహుస్సేన్..!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!