నేను ఋణపడి ఉన్నాను...

జీవితంలో నేను ఎంతోమందికి ఋణపడి ఉన్నాను...అందులో కొందరి  పేర్లు తెలియదు...కొందరికి  నేనే తెలియదు...ఇంకొందరికి నేను వాళ్ళకి రుణపడి ఉన్నా అన్నా ఆలోచనే రాదు...ఇంకొందరు నాకే ఎంతో రుణపడి ఉన్నాము అనుకుంటారు.... నాకు నా కంటి ముందు జరిగే ప్రతి సంఘటనా...నాకు పాఠాన్ని నేర్పించడానికే....అని అనిపిస్తుంది...ప్రతిదీ మన జీవితంలో జరిగితేనే నేర్చుకోవాలి అని అనుకుంటే దానికి మనకు ఒక్క జీనితం సరిపోదు....

"చిన్నా" ఈ పేరు ఇష్టం...ఎందుకంటే నేను జీవితానికి రెండోకోణం చూడడం నేర్చుకుంది ఇక్కడే....నేను ఏ సమస్య చెప్పినా నాకు తెలియని ఇంకొ కోణం నుంచి సమస్యని చూసి జవాబు చెప్పేది తను. అదే మొదటి మెట్టు. అది నన్ను ఎంతగా మార్చింది అంటే.... ఒక స్కూల్ ప్రిన్సిపాల్ మా ఇంటికి వచ్చి నా కోసం వెయిట్ చేసి...మీ అమ్మాయిని మా స్కూల్ లో వేయండి అని అడిగి...మీరు  మా స్కూల్ కి మార్చరని తెలుసు...మిమ్మల్ని చూడడానికే వచ్చాను...మీ మాట, మీ ఆలోచన రెండు బాగున్నాయి అని అంది.అలా ఒక పొగడ్త అందుకునే స్థాయికి పెంచింది...

హాస్పిటల్ లో పరిచయం అయిన వినోదిని....నాకు ఒక అద్బుతం....వాళ్ళ బాబుకి చాలా పెద్ద జబ్బే చేసింది. వాళ్ళ బాబుకి ప్రతి నెల 4 రోజుల చికిత్స ఉంటుంది.అపుడు చాలా బరువు తగ్గిపోతాడు.మళ్లీ చికిత్సకు వచ్చేప్పటికి ఆ బాబు నెలకి 8 నుంచి 10 కే.జి.ల తప్పని సరిగా బరువు పెరగాలి. డబ్బు ఖర్చు కూడా చాలా ఎక్కువ. తను ఎలా ఉండేదంటే ఎవరు జాలి పడేట్టుగా మాట కాని మనిషి కాని ఉండేది కాదు. మొదటిసారి చూస్తె ఎంతో డబ్బు ఉంది, ఏ  బాధలు  లేవేమోననిపిస్తుంది. .మనకు బాధలు ఉండొచ్చు, కాని మనం జాలి పొందేట్టు ఉండకూడదని...కొన్ని పెట్టుబడుల గురించి చిన్నమాట కూడా పొరపాటుగా మాట్లాడకూడదని. ఆమె దగ్గర తెలుసుకున్నా..

ఒక రైలు ప్రయాణం లో కలిసిన వ్యక్తి...సంవత్సరం తరవాత అలా చూసి వచ్చి పలకరించి నేనండి..అపుడు మీతో కలసి వచ్చాం అంటూ గుర్తు  చేస్తే....ఇంతలా గుర్తుపెట్టుకోడానికి మాటే కారణం అని తెలియ చెప్పిన వ్యక్తి.. మనసుతో మనిషి తో మాట్లాడితే  ఎలా ఉంటుందో  చెప్పిన సంఘటనే తప్ప మనిషి పేరు ఊరూ తెలీదు..

నేను ఎవరికైనా చెప్పేదాన్ని ఏదైనా సమస్య వస్తే ఏడవడం సమాధానం కాదు అని, చెప్పడం తేలికే ఆలా ఉండలేరు అని అనేవాళ్ళు అందరూ. ఒకసారి ఒక అబ్బాయికి ఆక్సిడెంట్ అయింది. పక్కనే ఉన్న చిన్న హాస్పిటల్ కి తీసుకొస్తే ఆక్సిజన్  పెట్టారు. ఇంటికి కబురు పెట్టారు..అతని చెల్లి తాత వచ్చారు...అమ్మ మటుకు రాలేదు..15 నిముషాలు అయింది అందరూ ఏంటి తల్లి రాలేదా, తెలిసి కూడా ఇంకా రాలేదా అని గుసగుసలు...

కాసేపటికి వచ్చింది ఎలానో తెలుసా...ఎవరు జాలి పడేట్టు ఏడుస్తూ అరుస్తూ లేదు ..ఏ.టి.యం కార్డు, డబ్బులు, అప్పటికే 108 కి ఫోన్ చేసిందట,ఇంకా అంతకుముందే ఆ అబ్బాయికి ఏదో ఆపరేషన్ అయిందట కామినేనిలో,దాని తాలూకు ఫైల్స్, కామినేని కి ఫోన్ చేసి డాక్టర్ అప్పాయింట్మెంట్ తీసుకోడం అన్ని చేసింది..ఎక్కడా ముఖంలో గాబరా లేదు..ఒక టైంలో ఆ అబ్బాయి బేలగా మారితే... ఎందుకు నువ్వు గాభరా పడుతున్నావ్! నేను ఉన్నా కదా ఏమి కాదు...నమ్మకం లేదా అని అంది...తల్లి వచ్చిన కాసేపటికే అతను ఎంతో రిలాక్స్ గా కనిపించాడు.ఆ  ప్రమాద సంఘటన ఒక బాధ్యత గల తల్లి ఎలా ఉండాలో చెప్పింది.

నా చుట్టూ ఇపుడు ఉన్న ఈ పిల్లలు... ఆ పిల్లల ఆటోగ్రాఫ్ బుక్ లో ఎవరంటే ఇష్టం అన్న దగ్గర "నా పేరు" కనిపించడానికి కారణం...నరేష్ ...మా నరేష్...ఈ అబ్బాయి అసలు నచ్చెవాడు కాదు మొదట్లో, కానీ తనకి నేను ఇష్టం ఏమో, నా కోపాన్ని ఎవరు చూడనంతగా చవి  చూసినవాడూ నా జీవితంలో నరేష్ మాత్రమె...ఇష్టం ...నచ్చడం కి ...సంబంధం  ఉండాలని లేదు అని తెలుసుకుంది మాత్రం మా అబ్బాయి అనుకునే నరేష్ నుంచి  అని మాత్రమే...

ఇంతే కాదు చాటింగ్ లో కూడా అద్బుతమైన వ్యక్తులు ఉంటారని తెలుసుకున్నా..జీవితం కన్నా మన అనుకున్నా మనిషే  ఎక్కువ  అనేవాళ్ళని చూసా...మన అనుకున్నా వాళ్ళకు మన అరచేయి అడ్డుగా ఉండాలి అని నేర్చుకున్నా..ఎన్ని ఇబ్బందులు వచ్చిన నువ్వు నిజాయితీగా నిజం వైపు  ఉండు. అలానే నాకు ఇష్టం..నువ్వే నా రోల్ మోడల్ అని చెప్పే నా కూతురు వాళ్ళ స్నేహితుల నుంచి పిల్లలతో ఎలా ఉండాలో తెలుసుకున్నా..

అంతే కాదు..మనం ఎంత మంచిగా ఉన్నా, ఆ మంచితనం మంచివాళ్ళ మధ్యనే రాణిస్తుంది...కావలసిన సమయంలో కఠినంగా ఉండలేకపోతే అది నీ అసమర్ధత..ఇష్టం తో కూడిన బాధ్యత అన్నిటి కంటే ఉన్నతంగా ఉంటుంది అని, మాట ఇవ్వడం అంటే..మాటవరసకు అనడం అంటూ ఉండకూడదు అని యిలా ఎందరో ఎదురుపడితే నేర్చుకున్నవే... యిలా ఎంతో మంది నుంచి ఎన్నో నేర్చుకుంటూనే ఉన్నా!....ఇలాంటి వాళ్ళందరికీ ఏమిచ్చి ఋణం తీర్చుకోను! శిరస్సు వంచి నమస్కరించడం తప్ప!
 

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!