మనిషి లోపల మహాసముద్రాలు (పుస్తక పరిచయం)– కిల్లాడ సత్యనారాయణ

ఎన్నో మానసిక వికాస పుస్తకాలు వచ్చాయి. ఎందరో రాశారు మరెందరో చదివారు.ప్రవృత్తి రీత్యా రచయిత అయిన కిల్లాడ సత్యనారాయణ(వృత్తి రీత్యా ఐ.పి.యస్) వ్రాసిన “మనిషి లోపల మహాసముద్రాలు” పుస్తకం మాత్రం మనసు నొప్పిపడి, మనసు తడితో పలికిన అపూర్వమైన భావాలు (మనసుని తాకే సౌరభాలు)అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

రచయిత ముందుమాటలో “జీవితం నుండి మనిషికే కాదు, మనిషి నుండి జీవితానికి కొన్ని ఆపేక్షలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని పనులు వాళ్ళ కోసమే పుట్టబడ్డాయి. అవి వాళ్ళను వెతుక్కుంటాయి. ఆ పనులే ఆ వ్యక్తి జీవితానికి పరిమళాన్నిస్తాయి.” అన్నారు. అంతేకాకుండా “అందుకే, కానీలు, అర్ధానాలు లేకుండా చదవండి” అంటూ పాఠకలోకానికి విన్నపించారు.

ఈ పుస్తకంలో ఉన్నమొత్తం 13 వ్యాసాలు కూడా చదువరిని తన మనసు మూలాలకి తీసుకెళుతుంది. మనసుభాషే మాతృభాష అనే మొదటి వ్యాసం లో మాతృభాష అంటే తల్లి చనుబాల వంటిదే.తల్లి చనుబాలు తాగి పెరిగిన బిడ్డ ఏ పదార్ధానైనా జీర్ణించుకోగలదు. అలాగే మాతృభాషపై పట్టు ఉన్న వ్యక్తి ఏ భాషలో నైనా రాణించగలడు. ఆంగ్లభాష జీతం కోసం నేర్చుకోవడం తప్పనిసరి అంటూ అందరూ అనుకునేదాన్ని ఆక్షేపించక పోయిన మాతృభాష మరచి పోవడం, మరుగున పడిపోవడం అన్నది ఎంత అనర్ధమో సూటిగా మనసుని కదిలిస్తుంది.

అవును-కాదుల అంతరార్ధం లో ఏమి చేయాలి అన్నదానికన్నా ఏమి చేయకూడదన్నదానికే మనం మనకు తెలియకుండానే ఎలా  ప్రాముఖ్యత ఇస్తున్నామోతో మొదలుపెట్టి దేనికి ‘కాదు’ , దేనికి ‘అవును’ చెప్పాలి. మనము అవును అనవలసిన దానికి కూడా కాదు అన్న జవాబు ఎందుకు ఇస్తాము అనే వాటికి సంయమమైన భావాలతో విశదీకరిస్తూ.. బాధ్యత స్వేకరించిన మనస్సుకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అందులో నుండి ‘అవును అనే రాగం వినిపిస్తుంది అంటూ ఒక గొప్ప స్పూర్తి భావన ‘అవును’ తో ముగించారు.

మార్పుకి ముఖద్వారం వినడం లో మనసుని కట్టిపడేసే వాక్యాలు కోకొల్లలు. అందులో కొన్ని ... “మనసు స్వేచ్ఛగా లేనిచోట వినడానికి దారులు మూసుకుపోతాయి”. “’నేను ఫలానా, నాకు ఫలానా అని ఆలోచించే మనస్సుకు వినడం సాధ్యం కాదు”. “ఆత్యాత్మిక సాధన అంటే శబ్ధాలు వినబడకుండా చేసుకునే ప్రయత్నం కాదు. నిశ్శబ్దాన్ని కూడా వినగలిగేలా చేసుకోగలిగిన సౌలభ్యం”.  “విశ్వగానానికి గొంతు మాత్రమే కాదు, చెవులు కూడా సాధన చేయాలి”.

శబ్ధ-దృశ్యాలకు ఆవల లో మనిషి జీవితాన్ని అన్ని దిశల్లో,అన్ని దశల్లో ప్రేరేపిస్తున్న అదృశ్య శక్తులు అయిన శబ్దం- దృశ్యంల లోలోతులను తడిమి, జీవితం ఆనందంగా సాగడానికి ఎటువంటి జాగ్రత్త అవసరమో చర్చించారు. సమూహంలో ఒంటరితనం లో పిల్లలు,యువత, వృద్దాప్యం అన్న తారతమ్యం లేకుండా ఒంటరితనం అనేది తెలియకుండా దొంగలా ఎలా మన జీవితంలోకి ప్రవేశిస్తుందితో మొదలెట్టి ‘ఒంటరితనం అనే వత్తిని ఆశ అనే అగ్ని’తో వెలిగించుకోవాలి అన్న ఆశాభావాన్ని మనలో రేకెత్తించడంతో ముగిస్తారు.

తలరాత-అదృష్టం లో అనుకున్నదానికంటే ఎక్కువ జరిగితే అదృష్టం, లేదంటే తలరాత అనుకోడం సబబు కాదంటూ ఆనందమైన జీవితాన్ని గడిపేందుకు 6 మార్గాలను విశదీకరించారు.

శిక్ష-బహుమానంలో  ఒక మనిషి తన డిమాండ్ ని నెరవేర్చుకోవడం కోసం అమలు చేసేది శిక్ష, బహుమానం కూడా. తన డిమాండ్  నెరవేర్చుకోడానికి తన స్థాయి కింది వాళ్లపై శిక్షతో, పై వాళ్ళు అయితే బహుమానంతో సాధించుకుంటాడు... మనిషిని తరతరాలుగా నడిపిస్తున్న శక్తి  శిక్ష, బహుమానం. వీటికి ఒక సమన్వయ విన్యాసాన్ని చేకూర్చారు.

సాధన సృజనకు శత్రువా? వ్యాసంలో సృజనాత్మకము అన్నది ఒక అక్షయ పాత్ర తోడే కొలది పెరుగుతుంది. దీనికి సాధన తోడైతే సృజన అడ్డంకి అవుతుందా, సృజన లేని సాధన అంటే... సాధన లేని సృజన.. వీటిన్నంటికి సమాధానం చెపుతూ జీవితంలో ఏది కావాలో ఎందుకు కావాలో దిశ  నిర్ధేశన చేసుకోడానికి ఒక బాటని వేశారు రచయిత.    

లక్ష్యాలు-మార్గాలు లో అకస్మాత్తుగా స్పురించిన ఆలోచన ఒక అద్భుత  పద్యాన్ని సృష్టించినట్టు,సరైన మార్గంలో నడుస్తున్నపుడు లక్ష్యం దానంతట అదే ఏర్పడుతుంది. ఎంత సంపాదించాలన్నది లక్ష్యం అయితే, ఎలా సంపాదించాలన్నది మార్గం అని సూక్ష్మంగా చెపుతూ మనకు డబ్బే లక్ష్యమైనపుడు సుఖమూ,శక్తి రెండూ దూరమవుతాయి అని చెప్పి మనలో ఆలోచనలు రేకెత్తిస్తుంది.

 జయాపజయాలు లో పిల్లల జయాపజయాలు పెద్దల పేరు ప్రతిష్టలుగా మారడం, అందుకే వారి విజయం పెద్దల బాధ్యతగా తయారయింది అంటూ సమాజాన్ని ప్రశ్నించినట్టు అనిపించినా గెలుపు ఓటముల వల్ల ప్రాణాలు కోల్పోవడం అనేది జరగరాదని, జీవితానికి కావలసినది జీవించడమే ముఖ్యం అందుకు ప్రతీవారు గుర్తించాల్సిన విషయాలను తెలిపారు.

ఆకాంక్షలు-అవకాశాలు లో  మనిషి వస్తువులను ఎక్కువగా ఫ్రేమించడానికి కారణమయిన కోరికలు, జీవనముని చర్చిస్తూ మనిషి  మనుషులను వాడుకోవాలి-వస్తువులను ప్రేమించాలి అనే దిశ నుండి మనుషులను ప్రేమించాలి- వస్తువులను వాడుకోవాలి అనే దారివైపు నడవడానికి చేయూత నిస్తుంది.

ఆనందమే జీవితం లో జీవితం ఆనందంగా ఉండాలంటే సంతృప్తి ముఖ్యం అని ప్రతీవారికి తెలిసినా ఆనందంగా గడపలేరు. జీవితం ఆనందంగా గడపలేకపోడానికి ఉన్న ఆరు ఆటంకాలను చర్చిస్తూ జీవనసాగరంలో మనం ‘జలచరాలుగా బ్రతకాలి కానీ ఈతగాళ్లగా కాదు’అంటూ ముగించారు.

మనిషి  లోపల మహాసముద్రాలు లో మన మనసులోని లోతుల్ని ఒకసారి తడిమి చూడమని చెపుతూ మొత్తం 12 వ్యాసాలకు ముగింపు పలుకుతుంది

రచయిత పరిచయం:కిల్లాడ సత్యనారాయణ గారు విశాఖపట్నం జిల్లాలోని పాములవాక గ్రామంలో జనించారు. నాలుగు సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తి అనంతరం 1998 లో ఐ.పి.ఎస్  ఆఫీసర్ గా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కేడర్లో నియామకం.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డి.జి.పి కార్యాలయంలో ఐ.జి.పి హోదాలో ఉన్నారు. 2018 లో ‘మనిషి నా భాష’ అనే కవితాసంపుటి వెలువరించారు.రచయిత cell: 8333987838

మనిషి  లోపల మహాసముద్రాలు ప్రచురణ  విశాలాంద్ర బుక్ హౌస్ లోను మరియు అన్ని ప్రముఖ పుస్తక సంస్థలో  కూడా దొరుకుతుంది.​


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!