విరంచి మీటిన మనసు విపంచి -6...నల్లమోతు శ్రీధర్

ఎలా ఉండాలి ...ఇలా మాత్రం ఉండనవసరం లేదు ... అయినా ఇలానే ఉంటున్నాము... ఈ చక్రం నుండి నిజాయితీగా వైతొలగి ... నిండైన మానవసంబంధాలని మెరుగుపరుచుకుంటారనే ఆశయంతో .. మనసులోని అలజడులను అరచేతబిగించి సంధించిన ఏకలవ్యుడి శరాఘాతాలే  నల్లమోతు శ్రీధర్ అందించిన ఈ ఆర్టికల్స్ "యెస్.. (Yes)" , "కానీ (but)...", "ఎందుకు...(why)", "టైమ్ లేదు (No time)"

ప్రతీ ఒక్కరు ప్రతీ పనిని ఎంతో నిజాయితీగా, సమర్ధవంతంగా చేస్తున్నాము అని ఇతరులకు చప్పడం లో ఒకరిని మించిన వారు ఒకరు... అందరికి తెలుసు అందులో నిజం ఎంతో.. అయినా కూడా ఎవరు కూడా గుర్తించనట్టుగా నటించడం...నిజంతో మనకు పనేముంది!! అని ప్రశ్నించే శరాఘాతం"యెస్.. (Yes)"

ఎవర్నీ నొప్పించక లౌక్యంగా తరచూ వాడే బ్రహ్మాస్త్రం.. "కానీ (but)...", సరే అంతటితో అయిపోయిందా అంటే లేదు... నటన తెలియని ఎక్కడో కొందరు అమాయకపు ఛాయలు వదలని వారు కనిపిస్తే చాలు... మీరు ఇలా ఉన్నారు పర్లేదు కానీ అంటూనే వాళ్ళ శ్రేయస్సును కోరుతున్నట్టు చెపుతూ "డ్రర్న్ సొసైటీలో మోడ్రర్న్‌గా లేకపోతే ఎలా?"   అంటూ శ్రేయోభిలాషిలా  నటించడం నాకు రాదు అన్నట్టుగా నటించడం ...ఆనందంగా బ్రతికే మనం పోగొట్టుకున్నవేమితో గుర్తించమని సూచించే శరాఘాతం "ఎందుకు...(why)"

నిజమేనేమో ఇదంతా చేసేది నలుగురు కలిసి ఉండాలని అని అనుకుంటే ... అసలు మానవసంబంధాలని సమయం లేదన్న సాకుతో దూరం చేసుకోవడం లో సిద్ధహస్తులు... కాల్ చేస్తే మనస్ఫూర్తిగా మాట్లాడేటంత మనసూ, సమయం ఉందా మనకు?...ఆలోచించండి అంటూ సంధించే విలువైన ఏకాలవ్వుడి శరాఘాతం ..."టైమ్ లేదు (No time)"
 
YES..   BUT...why..NO TIME.. ఏకలవ్యుడి శరాఘాతం..
యెస్.. (Yes)

మనకు అన్నింటికీ ఆధారాలు కావాలి.....
వ్యవస్థలు ఎంతగా పతనమవుతున్నా ఫర్లేదు...

మనందరికీ తెలిసిన విషయమే అయినా... valid source కన్పించనంత కాలం నిజం కప్పేయబడుతూనే ఉంటుంది...

అందుకే వ్యవస్థల్లోనీ, మనుషుల్లోనీ లోపాలు ఎవరికీ కన్పించకుండా ప్రతీ ఒక్కరూ చాలా టెక్నిక్‌గా దాచేసుకోవడంలో సిద్ధహస్తులవుతున్నారు.

-----------------

అన్నీ నడిపోతూనే ఉంటాయి.. తల్లిదండ్రులు చదివిస్తున్నామనుకుంటారు.. పిల్లలు చదువుకుంటున్నామనుకుంటారు... విద్యాసంస్థలు చదువు చెప్తున్నాయనుకుంటాయి...పౌరులు కష్టపడుతున్నామనుకుంటారు.. నాయకులు సేవ చేస్తున్నామనుకుంటారు....

వాస్తవానికి అవన్నీ జరిగినా జరగకపోయినా!!
నటించడం అలవాటు చేసుకున్న ప్రాణాలం కదా.. నిజంతో మనకు పనేముంది!!
- నల్లమోతు శ్రీధర్

కానీ..(But)
ఎంత పవర్ ఫుల్లో...

ఎవర్నీ నొప్పించక లౌక్యంగా తరచూ వాడే బ్రహ్మాస్త్రం..

"నువ్వు చెప్తున్నదంతా కరెక్టే.." అనగానే పొంగిపోయే జనాలు కాస్తా... "కానీ" అనే word కన్పించగానే గుటకలు మింగుతారు.. ఆ "కానీ.." తర్వాత మళ్లీ ఏ మతలబు రాబోతోందో అర్థం కాక!

మనం మాట్లాడే మాటల్లోని లాజిక్‌ని సమర్థిస్తున్నట్లు సమర్థిస్తూనే... మరింత విభిన్నమైన లాజిక్‌తో మనం మాట్లాడకుండా కట్టిపడేసే ఓ ఎత్తుగడ....

చాలా "కానీ..."లు ఎంతకీ తెగని నిరుపయోగమైన చర్చలకూ... ఆధిపత్య పాకులాటలకూ దారితీయడం రోజూ మనం చూడొచ్చు...
------------
కానీ.......
హహహ... ఏం లేదులెండి!! 
- నల్లమోతు శ్రీధర్.
.
ఎందుకు..(why)
కొత్తగా పెళ్లయి ఏ పల్లెటూరి నుండో వచ్చిన అమ్మాయిలూ, లేదా చదువుల కోసం వచ్చిన అబ్బాయిలూ.. అమాయకంగానూ, బెరుకుగానే ఉంటుంటారు..

ఆ అమాయకత్వం ఎక్కడ హేళన చేయబడుతుందోనన్న భయమూ ఉంటుంది వాళ్లకి...
కాస్మొపాలిటన్ నాగరీక జనాభా కూడా సభ్యత మర్చిపోయి వారిని తేరిపారా చూస్తుంటుంది.... వాళ్లు కుంచించుకుపోయేలా..

నాగరీక ప్రపంచం ఎటూ ఏ పూర్వ జన్మలో చేసుకున్న పాపం వల్లో ఎటూ అమాయకత్వాన్నీ, బేలతనాన్నీ పోగొట్టుకుంది సరే.... కనీసం అమాయకంగా ఉంటే మనుషుల్నీ అలాగే ఎందుకు మిగల్చరు?

"డ్రర్న్ సొసైటీలో మోడ్రర్న్‌గా లేకపోతే ఎలా?" అని క్లాసులు పీకి మరీ వారిలోని సున్నితత్వాన్నీ, అమాయకత్వాన్నీ కసిదీరా చంపేస్తారు.

ఇంకేముంటుంది.. ఆ ఫేసుల్లో... ఒక్క సున్నితమైన ఎక్స్‌ప్రెషనూ లేని రాతి మొహాలు తప్పించి!!

స్పూనుల్తో, ఫోర్కుల్తో తినడం నేర్పించి చాలా ఘనకార్యం చేసినట్లు భావించడం కాదు.. వారికి ఉన్న అనేక సంస్కారాల ముందు ఈ మోడ్రన్ మనుషుల ఇరుకుతనం వెలవెలబోతుంది.

పల్లె జనాభా కాదు నేర్చుకోవలసింది.. పట్నం జనాభా చాలా నేర్చుకోవాలి ఆనందంగా బ్రతికే మనం పోగొట్టుకున్న సహజత్వాన్ని!!

- నల్లమోతు శ్రీధర్
 
"టైమ్ లేదు (No time)"
 
ఏ పలకరింపు తీరేమిటో అర్థం కానంత గందరగోళం..

ఏదో సరదాకి, స్నేహపూర్వకంగా ఎవరైనా కాల్ చేస్తే.. "ఆ చెప్పండి.." అంటూ మాటల్లో అసహనాన్ని తొక్కిపెట్టుకుని.. వాళ్లేదో అవసరానికి కాల్ చేశారనుకుని ఒకింత దబాయింపుగా.. అస్సలు ఇంట్రెస్టే లేకుండా మాట్లాడితే ఏం మాట్లాడబుద్ధవుతుంది?

మన మాటల్లోని టోనే అర్థమవుతుంది.. మనం మాట్లాడడానికి సుముఖంగా లేమని.. ఎప్పుడు ఫోన్ పెట్టేస్తారా అని చాలా అసహనంగా ఉన్నామని! పాపం అభాగ్యులు ఇంకేం మాట్లాడతారు? 

"సరదాగా మాట్లాడేటంత టైమ్ నాకెక్కడుంది.." అనుకుంటూ లోపల్లోపల తిట్టుకుంటూ పొడిపొడిగా మాట్లాడే నాలుగు మాటలంతే... పాపం మళ్లీ జన్మలో బుద్ధెరిగి మనకు వాళ్లు ఫోన్ చేస్తే ఒట్టు..

-------------------

అదే ఎవరైనా నిజంగానే మనతో అవసరం పడి కాల్ చేస్తే.. "ఇన్నాళ్లూ గుర్తులేను.. ఇవ్వాళ అవసరం వస్తే కాల్ చేశాడు" అనుకుంటూ నిష్టూరాలు పోతాం.. మామూలప్పుడు కాల్ చేస్తే మనస్ఫూర్తిగా మాట్లాడేటంత మనసూ, సమయం ఉందా మనకు?

సెంటిమెంట్లనీ, ఎమోషన్లనీ మన నిష్టూరాలకూ, కోపాలకూ ఇష్టమొచ్చినట్లు వాడేసుకోవడం మహా బాగా చేతనవుతోంది... ప్రతీ ఒక్కరికీ!!

----------------------

సరదాగా మాట్లాడాలనుకున్న వ్యక్తితో మాట్లాడే సమయమూ లేదు...

అవసరానికి మాట్లాడే వ్యక్తి అవసరం తీర్చడానికి... "అతను అవసరం వచ్చినప్పుడు తప్పించి సరదాగా ఎప్పుడూ కాల్ చెయ్యలేదే" అన్న ఓ వంక..
అస్సలు మనకేం కావాలి? ఎవరికైనా క్లారిటీ ఉందా..
- నల్లమోతు శ్రీధర్

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!