బేరం

ముంబయి శివారు ప్రాంతాలలో షాపింగ్ మాల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆదివారం పూట తమ సాయంత్రాలు ఇలాంటి మాల్స్ లో గడిపే అనేకమంది ముంబయి వాసులలో నేనూ ఒకదాన్ని. అవసరం లేకపోయినా, ఏదొ ఒకటి కొనుక్కోడం, ఇంటికి మోసుకొచ్చుకోడం అలవాటైపోయింది.

నిన్న సాయంత్రం మాల్ లో రకరకల వస్తువులు, వాటి ధరలు, బ్రాండ్లు వగైరాలన్నీ పరిశీలించాక, ఇల్లు చేరాను. ఈ రోజు నా మాములు దినచర్య ప్రారంభమైంది.  ఎప్పటి లాగే, ఆఫీసుకు వెళ్ళేందుకు లోకల్ ట్రైన్ ఎక్కాను. ఓ గంట ప్రయాణం! సీటు సంపాదించుకోడనికి లేదా సౌకర్యంగా  నిలబడే స్థలం సాధించుకోడానికి నా తోటి ప్రయణీకులు ఒకరినొకరు తోసుకుంటున్నారు, నెట్టుకుంటున్నరు. అందరికంటే ముందుగా, రద్దీగా ఉన్న ఆ బోగీ లోకి ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు.

నాకీ తోపులాటలో రైలెక్కాలంటే విసుగు. ఇలాంటి వాళ్ళంతా ఎక్కాక, తీరికగా ఎక్కడం ఇష్టం. రైలులో ప్రయాణం చేస్తుంటే నాకు రెండు కొత్త అలవాట్లు వంటబట్టయి. మొదటిది బోగీ తలుపు దగ్గర నిలుచుని చల్ల గాలిని ఆస్వాదించడం, రెండోది – సాటి ప్రయాణీకుల కబుర్ల పై ఓ చెవేసి ఉంచడం!
ఈ రోజు నేను ఎప్పటి లాగే నా తోటి ప్రయణీకుల సంభషణలు వింటూ, వళ్ళ చేతలను గమనించసాగాను. నా చూపులు బోగీ లోని ప్రయాణీకులందరిపై ప్రసరించి, ఓ బోసి నవ్వు ముఖం పై ఆగిపోయాయి. ఆమె చేతి సంచులు అమ్ముకునే ఓ ముదుసలి. ఆమెని మరింతగా గమనించసాగాను. మా లేడీస్ కంపార్ట్ మెంట్ లోని మహిళలు తన చేతి సంచుల అమ్మకానికి ఆ ముసలామె చేస్తున్న ప్రయత్నాలను పట్టించుకోకుండా తమ తమ కబుర్లలో మునిగిపోయారు. అయితే ఆమె ఏ మాత్రం నిరాశ చెందకుండా, చిరునవ్వుతో ప్రయత్నించసాగింది. కాసేపయ్యాక, మా తోటి ప్రయాణీకులలో కొందరు ఆమె అమ్మజూపుతున్న చేతి సంచులపై ఆసక్తి చూపించారు.

వాళ్ళంతా కాస్మోపాలిటన్ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారు. మడతలు నలగని చీరలు, సల్వార్ స్యూట్లు ధరించి ఉన్నరు. ఆమె దగ్గరున్న చేతి సంచులన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటి ధర అడిగారు. కాని ఈ తతంగం అంతా పూర్తయ్యేసరికి, ఒక్కో చేతి సంచి ధర పది రూపాయలుంటుందని వాళ్ళు ఊహించారు.  సాయంత్రం ఇళ్ళకి వెళ్ళేడప్పుడు వాతిల్లో ఆకుకూరలు సులువుగా తీసుకెళ్ళవచ్చు.  కాని ఎవరు కొనలేదు. కొంత మంది గీచి గీచి బేరమాడి, చివరికి అంతగా పనికిరాని ఆ చేతి సంచి ధర ఎక్కువని,కొనకూడదని నిశ్చయించుకున్నారు.

అయితే ఇది ఆ ముసలామె ముఖం పై చిరునవ్వుని తొలగించలేకపోయింది. బోగీ అంతా కలయ తిరుగుతూ, కబుర్లు చెప్పుకుంటున్న ప్రతీ గుంపుని అడిగింది. కాని ఒక్క సంచీ కూడా అమ్ముడుపోలేదు. దాని ధర వినగానే వాళ్ళు విస్మయానికి గురయ్యారు. వళ్ళ ముఖాలు వాడిపోయాయి. ముసలామె విపరీతమైన ధర చెబుతోందని భావించారు. కొందరేమో అది అంత ధర ఉండదని వాదించారు. మరి కొందరు తగ్గించి అమ్మమని అడిగారు. ఇంకొందరు తాము చెప్పిన ధరకే అమ్మాలని ఒత్తిడి చేసారు. పెద్ద పెద్ద కొట్లలో తమకి అక్కర్లేని వస్తువులని సైతం అధిక ధరలకు కొనుగోలు చేసే వీళ్ళ ధోరణి నాకు విచిత్రంగా తోచింది.
నా ప్రయాణం ముగియవచ్చింది. నేను ముడుతలు పడ్డ ఆ ముసలామె ముఖాన్ని చూడలేకపోతున్నాను. ఆమె కళ్ళలో తాను గెలవగలననే నమ్మకం ఇంకా సడలలేదు. బహుశా, ఆమె గతంలో ఎన్నొ సార్లు ఓడిపోయి ఉండచ్చు కూడా!
గట్టిగా కేక వేసి ఆమెని పిలిచాను – నాకో సంచి కావాలంటూ!
ఆమె ముఖం వెలిగిపోయింది. ఎంతొ సంతోషంతో, తాను స్వయంగా కుట్టిన ఆ రంగు రంగుల చేతి సంచులను వర్ణిస్తూ, నాకు చూపించసాగింది. నా భావోద్వేగాలను అణచుకోడం నాకు కష్టమైంది. ఒక ఎర్రటి సంచి తీసుకుని, పది రూపాయల నోటు ఆమె చేతిలో పెట్టాను.
ఇది అక్కర్లేని బేరం ఏ మాత్రం కాదని నా మనసు చెబుతోంది.

ఈ కధని ఆంగ్లంలో Jui Chitre “The Bargain” అనే పేరుతో రాసారు. కొల్లూరి సోమ శంకర్ తెలుగులో అనువదించారు..ఈ కధ 25 ఫిబ్రవరి 2007 నాటి వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం లో ప్రచురితమైంది.....

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!