ఒక మ౦చిపుస్తక౦ గీతా౦జలి

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ టాగోర్ (Ravindranath Tagore). టాగోరు గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి.

రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది

గీతాంజలి తమకు నచ్చదని అర్ధ౦ కాదని అనే మాటే నాకు విపరీతంగా కనపడుతుంది అంటారు చలం.
గీతాంజలి కొంతవరకైనా అర్థం కావాలంటే కవిత్వరసాన్ని హృదయానుభవంగా తీసుకోగల సంస్కారం ఉండాలి. గీతాంజలి సంపూర్ణంగా అర్థం కావాలన్నా, అనుభవంలోకి రావాలన్న ఈశ్వరుడిలో విశ్వాసం ఉండాలి.
కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలో ఉంటే ఆ కవిత్వం నీకు అనవసరం
కవిత్వం చదివిన తరవాత కూడ నీ అనుభవానికి ఆ విషయం ఏ మాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృధా! నీకు తోచనిది, కనపడనిది, కవి చెప్పిన తరవాత నీ అనుభవంలోకి ఎంతో కొంత వస్తే అదే నీకు సరిపడే కవిత అని చెపుతారు.

అట్లాగే  ఇందులో కవి టాగోర్ ఎన్నో ఉపమానాలు ఉపయోగించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని చూస్తాడు, అందరిలా ఈశ్వరునికి ఒక రూపం ఇవ్వడు. ఈశ్వరుడంటే ప్రేమ, ఈశ్వరుడంటే కరుణ ఎక్కడో లేడు ఇదంతా ప్రేమ వారధే అంటారు కవి. కనుకనే తక్కిన భక్త కవులకన్నా ఈ యత్నం క్లిష్టం.

ఒకరి జ్ఞానాన్ని ఇంకొకరికి ఇవ్వడం కొంతవరకు సాధ్యం, కాని ఒకరి అనుభవాన్ని ఇంకొకరికి తెలియజేయడం అసాధ్యం, అటువంటి అనుభవం నేర్చుకోవాలని తపన ఉంటే తప్ప. మానవుడికి ఈశ్వరుని ప్రేమ ఎంత అవసరమో ఈశ్వరునికి మానవుని ప్రేమ అంత అవసరం.
ఎన్నొ మేలిముసుగుల కింద ఉన్న సౌందర్య దేవత, తన సత్య రూపాన్ని కవి  కన్నులముందు కదలడగా ఆ ఆనందలహరే ఈ గీతంజలి...
తన అంతశ్శాంతిని సాధించలేని మనిషి ప్రపంచశ్శాంతి సాధిస్తానని బయలుదేరుతున్నాడు. ఎప్పుడూ చెదరని శాంతి, అనంతమైన ఆనందం, అనిర్వచనీయమైన మాధుర్యం ఉన్నాయి నీ హృదయంలోని అల్పమైన ఆలోచనలు నీ అంతఃదృష్టిని కప్పేస్తున్నాయి. మా మాటలు విశ్వసించి నువ్వు సాధిస్తె ఈ ఐశ్వర్యమంతా నీది నాది మనందరిది అని కవి ఎంతో ఆనందంగా చెప్పారు గీతంజలిలో....
ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. .

ఇందులోని కొన్ని కవితలు .......(మొత్తం 103 కవితలు ఉంటాయి )
ఈ కావ్యంలోని ఈ కింది గీతం మహాత్మాగాంధీకి మిక్కిలి అభిమాన పాత్రమైంది.

ఈ మంత్రములు జపమాలలు విడిచిపెట్టు
తలుపులన్నింటినీ బంధించి,
ఈ చీకటిగదిలో ఎవరిని పూజిస్తున్నావు?
కళ్ళు తెరచి చూడు.
నీవు ఆరాధించే దేవుడు
నీ ఎదుట లేడు!
ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడో,
ఎచ్చట శ్రామికుడు రాళ్ళు పగులగొట్టుతున్నాడో,
అక్కడ ఆ పరమాత్ముడున్నాడు.
వారితో ఎండలో, వానలో ధూళి ధూపరితములైన వస్త్రములలో ఉన్నాడు.
నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టి
ఆనేల మీదికి పదా.....


మనసుకి హత్తుకొనే కవిత .......

ఊరివీధిలో గడపకూ భిక్షార్థినైబయలుదేరినవేళ--- నీ బంగారు రథందూరంగా ఒక మహోజ్వలస్వప్నంలా కనిపించు. ఎవరబ్బా ఈ రాజాధిరాజులని నేను ఆశ్చర్యపోయాను.
నాలోఆశలు చిగురించాయి. ఆకాశమంటాయి.నాకు పాడు కాలం గడిచిపోయిందికదా అనుకున్నాను. అడగకుండానేపెట్టే భిక్ష కోసం ధూళిలో అన్నివైపులా వెదజల్లిన సంపద కోసం వేచి నిల్చున్నాను.
నేను నిల్చిన చోటనే నీ రథం ఆగింది. నీ చూపునాపై వాలింది. చిరునవ్వు నవ్వుతూ నీవు రథాన్ని దిగివచ్చావు. చివరకు నా బ్రతుకు పండింది కదా అని సంబరపడ్డాను. అప్పుడు హఠాత్తుగానీవు నీ కుడిచేయిచాచి, 'నీవు నాకేం ఇస్తావు?' అని అడిగావు. ఒక రాజాధిరాజు ఒక బిచ్చగత్తెను చెయ్యిచాచి అడగడమనేది ఎంత పరిహాసమోచూడు! నాకు ఏం చేయాలో తోచక వెర్రిదానిలా నిల్చున్నాను. అప్పుడునా సంచీలో నుంచి ఒక చిన్న ధాన్యపుగింజను తీసి నీ చేతిలో ఉంచాను.
నేనుభిక్షాటనం చేసి ఇంటికి తిరిగి వచ్చిన పిదప నా సంచీలో ధాన్యం క్రిందపోసి చూస్తే, ఆగింజల మధ్య ఒక చిన్న బంగారపు గింజ కనిపించినప్పుడు నేను నమ్మ లేకపోయాను. వెక్కి వెక్కి ఏడ్చాను. అయ్యో నీవునన్ను 'నీవు నాకుఏమిస్తా'వని అడిగినప్పుడునా సర్వస్వం నీదేనని చెప్పే ధైర్యం నాకు లేకపోయెనే అనుకున్నాను.


ఇది పాఠ్యపుస్తకంలో ప్రచురింపబడిన కవిత...

ఎక్కడ మనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడ విరామమైన అన్వేషణ ,పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో,
తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో - ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు


Comments

Post New Comment


Katrina kife 30th Oct 2012 08:32:AM

I like this passage or assay and next page letter very much thankyou